మొత్తానికి కాంపస్ లో ఒక చాట్ సెంటర్ మొదలైంది. మెక్ డోనాల్డులతోటీ , పిజ్జా కుటీరాలతోటీ , కాఫీ డేలతోటీ సై అంటే సై అన్న ఒక భారతీయ చిరుతిండి. ఓ.కే కాంపస్ లో మంచి ఆదరణే లభిస్తోంది. మొదటి రోజు నిజంగా పండగ వాతవరణం నెలకొంది షాప్ కాం దగ్గర.
ఈ సందడి చూస్తుంటే ఎందుకో హఠాత్తుగా "నిషిద్దుడు" గుర్తుకొచ్చాడు. గుర్తుందా పోయిన ఆదివారం వార్తలో మాధవ్ ఆర్టికల్ నిషిద్దుడు. శర వేగంగా సాగిపోతున్న "ఆర్ధిక దున్నపోతును" ఒక్కసారి ఫ్లై ఓవర్ల కిందకి,రోడ్డు ప్రక్కన పేవ్ మెంట్ లపైకి తలతిప్పమనీ,అక్కడ సాగిపోతున్న సమాంతర ఆర్ధిక వ్యవస్థని పరిశీలించమంటూ మాధవ్ రాసిన కథనం. "దున్న కుమ్ముడుని" ఒంటరి బాలచంద్రుడిలా ధీటుగా ఎదుర్కుంటున్న ఈ చిన్న జీవుల మీద గోరు చుట్టపై రోకటి పోటులా రోడ్డు పక్కన తిను బండారాలు తయారు చేసి అమ్మడం పై ఢిల్లీ సర్కారు నిషేధం విధించిందట.
మిత్రమా ఒకానొక సాయంసంధ్యలో మిత్ర బృందంతో కలసి ఆరగించిన రోడ్డు ప్రక్కన పానీ పూరీ అందించిన తీపి జ్ణాపకాలు నీకెప్పుడైనా "మహా మాల్స్" అందించాయా? ...........అరే సోచో యార్.....నేనే కాదు చిన్నప్పటినుండీ ఈ మహనగరంలోనే పెరిగిన జంతువిజ్ణాన శాస్త్ర విద్యార్ధి విన్సెంట్ కూడా లేదనే అంటున్నాడు.మరి నీ మాటో.....