Friday, 19 April 2013

ఇది మీ కవిత్వం

పదే పదే ఎదురయ్యే ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఉంటుంది.
అయినా కానీ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.
" ఎందుకు ఇక్కడికి వస్తున్నాను అంటే యూనివర్శిటీ వాతావరణం , ఇక్కడి ఇంటలెక్చువల్ ఎన్విరాన్‌మెంట్ బయట ఉండదు కదా" అని నిన్న నాతో పాటూ షాప్‌కాం దాకా నడుస్తూ వచ్చిన ఒక పాత మిత్రుడు అన్నాడు. అతను ఇప్పుడు  నగరంలో ఒక పెద్ద కాలేజీలో జర్నలిజం శాఖకి HoD.
                                     అదీ చదవటమంటే. అక్షరాలని కాదు, అక్షరాల మధ్యన ఉన్న ఖాళీలని చదవటం. అక్షరాల మధ్యన చదవగలిగిన వారు కొందరుంటారు. వీళ్ళు క్లాసు రూముల బయట కూడా పాఠాలు వింటూ ఉంటారు. తరగతి గదుల బయట చదివిన చదువుని నేర్పటానికి, అక్షరాల మధ్యన ఉన్న ఖాళీలలో అర్ధాలు చూడటానికీ , మనం నిర్వచించుకున్న విద్యావిధానం సరిపోవట్లేదో  లేక ఆ స్థాయికి ఇంకా చేరుకొలేదో మరి. . ఏదేమైనా అలాంటి ఒకానొక సందర్భంలో ఆ లోటును తీర్చటానికి  కొన్ని భావాలు వ్యక్తుల రూపం తీసుకుని వస్తాయి. అలాంటి ఒక భావన ఢిల్లీ-జే.ఎన్.యూలో ఉంది. దాని పేరు "విద్రోహి".  తల్లిదండ్రులు రాం శంకర్ యాదవ్ అని పెట్టారు. కానీ విద్రోహిగానే సుపరిచితుడు.



                                     "మఠం భోజనం - సత్రం నిద్ర" లాంటి తెలుగు సామెత ఏదో ఉంది. పరిధులకావల జీవించగలిగే వారి గురించిన ఒక భావనని అందిస్తుంది అది. సామాజిక ప్రవాహగతులలో పడి కొట్టుకుని పోకుండా నిలిచి ఉండగలిగేవారు అతికొద్ది మంది చేయగలిగే పని అది. అందరూ చేయలేరు కానీ కొందరు చేయగలరు, అలాంటి వారిలో కొందరు ప్రవహగతిని అధిగమించటమే  కాక ప్రవాహ గమనాగమనాలను సరిదిద్దే పనిలో ఉంటారు.
                           విద్రోహి గత ముప్పై ఏళ్ళుగా JNUలో చెట్టుకిందా, పుట్టకిందా ఉంటూనే సమాజ ప్రవాహగతికి ఇంత నీడ కల్పిస్తున్నారు. ప్రశ్నించటం, తిరగబడటం అంగీకారయోగ్యంకాని చోట బహిష్కరణలు సహజమే. ఆయన రెండు సార్లు విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించబడి మరలా విద్యార్ధుల ప్రేమతో తిరిగి రప్పించబడ్డాడు. ఎనభైలలోనే విశ్వవిద్యాలయం నుంచి రెస్టికేట్ చేయబడిన విద్రోహి, ఇప్పుడు ఆ విద్యాలయానికి సూదంటురాయి లాంటి అనధికార ఆస్థాన కవి.   విశ్వవిద్యాలయంలో ఏ గంగా ధాభా దగ్గరో, లైబ్రరీ దగ్గరో కనిపించే విద్రోహి గురించిన షార్ట్ ఫిల్మ్ చూశాను ఇవ్వాళ. "మే తుమ్హారా కవీ హూం (I am Your Poet)" పేరిట నితిన్ కె పెమ్నాని నిర్మించిన ఈ లఘు చిత్రానికి ఈ ఏడాది  ముంబాయి అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు కూడా వచ్చింది.    


No comments: