జీవన గమనంలో మరువలేని జ్ఞాపకాల మజిలీ....అంతులేని సంతోషాల పందిరి.....HCU..................
Wednesday, 28 December 2011
నాకు నేను దొరికాను
మీరెప్పుడైనా టైం మెషీన్‌లో ప్రయాణించారా ? కొద్ది రోజుల క్రితం ఓ మిట్ట మధ్యానం లింగంపల్లిలో MMTS ఎక్కి నేను హైదరాబాదు బుక్ ఫెయిర్‌కి వెళ్ళాను. మంచిపుస్తకం స్టాల్లోకి వెళ్ళాక నాకు నిజంగానే ఒక టైం మెషీన్ ఎక్కిన అనుభూతి కలిగింది. పరాయీకరించబడిన జీవితంలో, మార్కులు, ర్యాంకులు, పెర్ఫర్మన్సుల ప్రవాహగతిలో పడికొట్టుకుపోతున్న నాకు మళ్ళీ నేను దొరికిన అనుభూతి కలిగింది. చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ కొత్త రంగుల్లో కనిపించాయి. చాలా మళ్ళీ పునర్ముద్ర్ణకు నోచుకున్నవే. వాటి ముఖచిత్రాలు మాత్రమే కాదు పబ్లిషర్లూ మారారు. కొన్ని పుస్తకాలకైతే అనువాదకులూ మారారు. అలాంటి వాటిలో ఒకటి ఆంటోనీ-డీ-సెయింట్ ఎక్స్పరీ రాసిన "చిన్నారి నేస్తం", అదిప్పుడు చిట్టి రాజు అనే పేరుతో పునర్ముద్రితమైంది. ఆశగా బుక్ తీసి కొంత చదివాను....అప్పుడు కానీ అర్ధ్మౌవలేదు...అది ఆత్మ లోపించిన అనువాదమని...ఇంకా సరిగ్గా చెప్పాలంటే అంకెలు మాత్రమే అర్ధంచేసుకోగలిగిన పెద్దవాళ్ళ కోణం నుంచి అనువదించబడిన పుస్తకమది. లియోన్‌వెర్త్‌కి అతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇచ్చిన అంకితం ఆ పుస్తకంలో లేదు....అంతే కాదు పుస్తకం ఆకారం, శైలికూడా కేవలం అంకెలు మాత్రమే అర్ధంచెసుకోగలిగిన పెద్దలకు మాత్రమే ఉద్దేశించినట్లుగా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం ఆ సాయంత్రం ఆ బుక్ ఫెయిర్‌లో తప్పిపోయిన నాకు నేను దొరికాను. ఎన్నాళ్ళ నుంచో నేను వెతుకుతున్న నేను దొరికేసరికి నాకు పట్టలేని ఆనందం కలిగింది. ఆ సాయంత్రం పుస్తకాల దుకాణాలు మూసేసే వరకూ అక్కడే ఉండి ఓ 300ల రూపాయల వరకూ జ్ణాపకాలనీ, మరికొన్ని కొత్త అనుభవాలనీ పొట్లాం కట్టుకుని నెక్లెస్ రోడ్డు స్టేషన్లో మళ్ళీ ట్రైన్ ఎక్కాను. :)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment